కలం, వెబ్ డెస్క్: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ‘నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సంక్షేమ దీపాలు వెలుగుతున్నాయి: పవన్ కళ్యాణ్
ప్రతి భారతీయుడికి దీపావళి శుభాకాంక్షలు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ‘దీప కాంతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే ఘన సంస్కృతి మనది. నరకాసురుడు అనే రాక్షసుడిని వధించాక మానవాళికి సుఖసంతోషాలు లభించాయి. ఆ సంతోషంతో దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటున్నాం. దీపావళి పర్వదినాన సంపూర్ణ ఆయురారోగ్యాలు, శుభాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కాంతి రేఖలను ప్రసరింపజేస్తోంది. సంక్షేమ దీపాలను వెలిగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి పక్షాలకు విజయాన్ని అందించి ముందుగానే దీపావళి వేడుకను తీసుకువచ్చారు’ అని సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు వారికి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకున్నారు.

