కలం, స్పోర్ట్స్: ఐపీఎల్లో కీలక ట్రేడ్ ఖరారైంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరనున్నాడు. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వెళ్లనున్నాడు. ఈ రెండు ఫ్రాంచైజీలు ఆటగాళ్ల మార్పిడికి అంగీకరించాయి. అయితే బీసీసీఐ ఆమోదం లభించిన తర్వాతే ఈ ఒప్పందం అధికారికంగా ఖరారు కానుంది. హార్దిక్ పాండ్యా పంజాబ్ జట్టులో ఆటగాడిగానే కొనసాగనున్నాడు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రేయస్ నాయకత్వంలో ఆడేందుకు హార్దిక్ కూడా సుముఖంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌కు ఈ రెండో విడత కూడా ఆశించిన స్థాయిలో సాగలేదు. అతడి నాయకత్వంలో మూడు సీజన్లలో రెండుసార్లు ముంబై ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. దీంతో మరోసారి జట్టు మారాల్సి వచ్చింది. మరోవైపు అర్ష్‌దీప్‌ను వదులుకోవడం పంజాబ్‌కు సులభమైన నిర్ణయం కాదు. ఆ జట్టుతో అతడికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్లో రాణించి భారత జట్టులోనూ చోటు సంపాదించాడు.
ప్రస్తుతం టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. హార్దిక్ రాకతో పంజాబ్ ఆల్‌రౌండ్ విభాగం బలోపేతం అవుతుందని జట్టు భావిస్తోంది. అయితే గత ఐపీఎల్ సీజన్ తర్వాత అతడు గాయాల కారణంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆటగాళ్ల రిటెన్షన్ గడువును బీసీసీఐ నవంబర్ 17 వరకు పొడిగించింది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి ముందు ఈ ట్రేడ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

