కరువు వేళ పశుసంపదకు సర్కారు భరోసా

కలం, ఖమ్మం బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలో పశుసంపద సంరక్షణ (Livestock Protection) కోసం ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కింద పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా పశుగ్రాస సాగుకు, మూగజీవాల తాగునీటి తొట్ల నిర్మాణానికి ప్రభుత్వం వంద శాతం ఆర్థిక సహాయం అందించనుంది.

ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండి, నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పశుగ్రాస సాగు పథకానికి అర్హులు. ఎకరా విస్తీర్ణంలో పశుగ్రాసం సాగు చేసేందుకు రూ.18,882 అంచనా వ్యయం నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఈ పథకం కింద ఎర్రచెంగలి, నక్కతోక గడ్డి, నీడ గడ్డి, ఉప్పు గడ్డి, ఈటి గడ్డి వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. సొంత భూముల్లో పచ్చిమేత పండించడం ద్వారా బయట నుంచి కొనుగోలు చేసే ఖర్చు తగ్గడమే కాకుండా, నాణ్యమైన మేత వల్ల పశువుల ఆరోగ్యం మెరుగై పాల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు.

అలాగే, ఎల్‌నినో కరువు పరిస్థితుల్లో మూగజీవాలకు తాగునీటి కొరత రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్ల నిర్మాణానికి కూడా అవకాశం కల్పించారు. పెద్ద పశువుల కోసం 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 0.6 మీటర్ల ఎత్తుతో నిర్మించే నీటి తొట్టికి రూ.34,707 అంచనా వ్యయం కేటాయించగా, మేకలు, గొర్రెల కోసం 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 0.3 మీటర్ల ఎత్తుతో నిర్మించే తొట్టికి రూ.43,000 అంచనా వ్యయం నిర్ణయించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ కోరారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాస సాగుకు, తాగునీటి తొట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె ఆ ప్రకటనలో సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>