గంజాయి క్వీన్ అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో గంజాయ్ క్వీన్‌గా పేరొందిన నీతూ బాయిని ఈగ‌ల్ పోలీసులు (EAGLE Force) అరెస్ట్ చేశారు. ఆమె గ‌త తొమ్మిదేళ్ల నుంచి గంజాయి దందా చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే నీతూ బాయిపై పీడీ యాక్ట్ న‌మోదైంది. గ‌తంలో ధూళ్‌పేట‌లో గంజాయి విక్ర‌యాలు చేసిన ఆమె కొన్నేళ్ల క్రితం నాన‌క్‌రామ్‌గూడ‌కు షిఫ్ట్ అయ్యింది. ఆ ఏరియాలో ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా విచ్చ‌ల‌విడిగా గంజాయి అమ్మకాలు చేస్తోంది. నీతూ బాయికి ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. భారీ మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో విక్రయిస్తూ వ‌చ్చింది. ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసుకొని ఈ దందా న‌డుపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 2023లో ఆమె కుమారుడు స్కార్పియో వాహనంలో 22 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. గతంలో ఈ కుటుంబానికి సంబంధించిన మూడు వేర్వేరు ఆపరేషన్లలో పోలీసులు రూ.67 లక్షల నగదు, 51.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ విక్రయాల ద్వారా సంపాదించినట్లు అనుమానిస్తున్న ఆస్తులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లంగర్‌హౌస్‌లో రెండు జీ ప్ల‌స్ 3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక జీ ప్ల‌స్ 2 భవనంతో పాటు మరికొన్ని ఆస్తులను పరిశీలిస్తున్నారు. నీతూ బాయి, ఆమె కుటుంబసభ్యులపై సుమారు 30 డ్రగ్స్, ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 కేసులకు సంబంధించి ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారం ప్రారంభించినట్లు ఆరోపణలున్నాయి. ఆమె నివాసానికి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన సుమారు 50 మంది వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు. తరచూ నివాస ప్రాంతాలు మారుస్తూ, మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆమెను చివరకు మంగళ్‌హాట్ వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈగల్ ఫోర్స్ పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. నీతూ బాయి ఇంట్లో ఉంటూనే రోజుకు రూ.24 ల‌క్ష‌ల మేర‌కు గంజాయి వ్యాపారం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆమె ఇంట్లో ఒక మ‌నీ కౌంటింగ్ మిషిన్‌, గంజాయి తూకం వేసే మిషిన్ కూడా గుర్తించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>