కలం, వెబ్‌డెస్క్: ఆహార భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఫుడ్ లైసెన్స్ కోల్పోయిన పుల్లారెడ్డి స్వీట్స్ (Pulla Reddy Sweets)కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు హైదరాబాద్‌లోని స్వీట్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న పుల్లారెడ్డి స్వీట్స్ సనత్ నగర్ యూనిట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రద్దు చేశారు. అయితే ఈ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ పుల్లారెడ్డి స్వీట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తన తనిఖీల వివరాలను అధికారులు కోర్టుకు సమర్పించారు. వంటగదిలో అపరిశుభ్రత, గోడలకు రంధ్రాలు, స్టోర్ రూమ్‌లో, ఫ్రిజ్‌లపై పురుగులు, స్వీట్ల తయారీ విభాగంలో బొద్దింకలు, తుప్పు పట్టిన ట్రేలు వంటి అనేక లోపాలు గుర్తించినట్లు నివేదించారు. ఆహారం తయారు చేసే సిబ్బంది చేతులకు గ్లౌజులు లేకుండా, తలకు క్యాప్ ధరించకుండా పని చేస్తున్న ఫొటోలను కూడా కోర్టు పరిశీలించింది. ఈ నేపథ్యంలో లైసెన్స్ పునరుద్ధరణకు కోర్టు నిరాకరించింది.
అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని హైకోర్టు ఆదేశించింది. సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న సంస్థలను గుర్తించాలని పేర్కొంది. డేట్ అయిపోయిన, కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అడ్డుకోవాలని సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మాంసం దుకాణాలు, సూపర్ మార్కెట్లు, వీధి ఆహార విక్రయ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో జిల్లా వారీగా తనిఖీలు చేపట్టాలని సూచించింది. ఫుడ్ శాంపిళ్లను సేకరించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుపై ఎనిమిది వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

