కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాక ముందు, వచ్చిన తరువాత కేసీఆర్ పాలమూరు జిల్లాను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారు. రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో విఠల్ రావు వంటి ప్రముఖ నాయకుడు ఉన్నా.. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ను ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో జరుగుతున్న రైతు మేళాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ పార్లమెంటులో పాలమూరు సమస్యలను ప్రస్తావించకపోయినా ఊరుకున్నారని తెలిపారు.
తెలంగాణ వచ్చి కేసీఆర్ (KCR) సీఎం అయ్యారని.. అప్పుడు కూడా జిల్లా ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని సీఎం రేవంత్ విమర్శించారు. సీఎంగా కేసీఆర్ ఉన్న కాలంలో రూ.20 లక్షల కోట్ల విలువైన బడ్జెట్లను రూపొందించారని.. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా ఎందుకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వెనుకబడిన ప్రాంతమని తెలిసినా.. కేసీఆర్ కనీసం కనికరం చూపలేదన్నారు.
మోదీ ముందు మోకరిల్లి..
మహబూబ్ నగర్ జిల్లాకు ఎంతో ఉపయోగపడే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ఆపేయించారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కాళేశ్వరం పేరిట మేడిగడ్డ బ్యారేజీని కట్టి, ఆయనే కూలగొట్టారని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ చేయాలని సీబీఐని కోరితే.. మోదీ ముందుకు మోకరిల్లి విచారణ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కట్టారని.. అప్పటి గవర్నర్ను తీసుకెళ్లి కాళేశ్వరరావు అంటూ పొగిడించుకున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఎత్తు పెరిగినా బుద్ధి పెరగలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల అవినీతి కుటుంబం వలనే మేడిగడ్డ కుప్పకూలిపోయిందన్నారు.
మేడిగడ్డ కూలిపోవడంతో..
మేడిగడ్డ(Medigadda)లో 16 టీఎంసీలను నీరు నిల్వ ఉంచినప్పుడే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక విషయం కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్లలో గేట్లను మూసివేయకపోతే.. మళ్లీ అవి మేడిగడ్డకే వస్తాయన్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందన్నారు.
మేడిగడ్డ కూలిపోవడంతో కన్నెపల్లి పంపులు పనిచేయవన్నారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ.. తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రమ్మంటే చర్చకు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు. దేవాదుల ద్వారా ఎత్తిపోతల ప్రారంభించి రైతులకు నీళ్లు అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులే ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నాయని స్పష్టం చేశారు.
Also Read : స్కూల్ వర్కింగ్ డేస్పై సీఎంకు ఎమ్మెల్సీ లేఖ
Follow Us On: Youtube

