కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రశ్నించినవారిని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేసి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ.. అభ్యర్థులతో శాంతియుతంగా ఆందోళన చేస్తే.. అడ్డగోలుగా అరెస్ట్ చేస్తారా..? అని ప్రశ్నించారు.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం ఎన్నికలు ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను నేరుగా నాగార్జున యూనివర్సిటీకి తరలించాల్సి ఉంటుందని జగన్ వివరించారు. అలా కాకుండా మధ్యలోనే నల్లపాడు (Nallapadu) వద్ద ఎందుకు దించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారని.. బ్యాలెట్ బాక్సుల కోసం ఏర్పాటు చేసిన భద్రత ఏమైనట్లు అని ఆందోళన వ్యక్తం చేశారు.
లాఠీఛార్జి ఎందుకు చేసినట్లు..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై కనిపించాయని జగన్ (YS Jagan) ఆరోపించారు. వాటిని స్వాధీనం చేసుకుని, ఆందోళన చేస్తున్న తమ పార్టీ నాయకులతో పాటు సామాన్య ప్రజలపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జి చేశారని ప్రశ్నించారు. మీరే తప్పులు చేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మార్చే ప్రయత్నం చేసి.. చివరికి తమవాళ్లపైనే తప్పుడు కేసులు పెడుతారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మీద డెకాయిట్, దొంగతనం కేసులు పెట్టడం అత్యంత హేయమన్నారు. నామినేషన్ల రిగ్గింగ్, నామినేషన్ల పరిశీలనలో రిగ్గింగ్, పోలింగ్ బూత్ల రిగ్గింగ్, పోలింగ్ రిగ్గింగ్.. చివరికి బ్యాలెట్ బాక్సులను రిగ్గింగ్ చేయడం చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందో నిదర్శనమన్నారు. అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలను గమనిస్తున్నారని.. తిరుగుబాటు ఖాయమని తేల్చి చెప్పారు.
Also Read : ఎన్నికల ఫలితాల్లో విజయం.. అయినా అక్కడ విషాదం!
Follow Us On: X(Twitter)

