‘హరీష్‌రావు’ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఆది శ్రీనివాస్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్‌రావు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత వల్ల కాకుండా, ఎల్ నినో ప్రభావంతో భానుడి భగభగలకు బోర్లు ఎండిపోవడం వల్లే పంటలకు నష్టం వాటిల్లిందని, ఈ విషయాన్ని రైతులే స్వయంగా ఒప్పుకుంటున్నా హరీష్‌రావు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తకుండా ఆంధ్రాకు వదిలేస్తున్నారంటూ నీచ ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావుపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసలు కాళేశ్వరం బ్యారేజీలు మేడిగడ్డ కుంగిపోవడం, సుందిళ్ల-అన్నారంలో సీపేజీలు ఏర్పడటానికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాళేశ్వరం దిగువన ఉన్న గోదావరి నీటిని తమ ప్రభుత్వం సమర్థంగా ఎత్తిపోస్తోందని గణాంకాలతో వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేళ్ల హయాంలో దేవాదుల నుంచి ఏటా సగటున 9.57 టీఎంసీలు మాత్రమే ఎత్తగా, తమ ప్రభుత్వంలో సగటున 18.13 టీఎంసీలు ఎత్తిపోశామని, ఇది 89 శాతం అధికమని వెల్లడించారు. కాళేశ్వరం దిగువన దేవాదుల (16.71 టీఎంసీలు), సీతారామ సాగర్ (8.10 టీఎంసీలు) ద్వారా ఇప్పటివరకు మొత్తం 24.81 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు అందించామన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం రైతులకు వరప్రదాయినిగా మారిందని, తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు దక్కాల్సిన వాటాను పక్కనబెట్టి, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల తాత్కాలిక ఏర్పాటుకు అంగీకరించి రాష్ట్రానికి మరణశాసనం రాసింది కేసీఆర్, హరీష్‌రావులేనని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు 558 టీఎంసీల న్యాయమైన నీటి వాటా కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా తమ ప్రభుత్వం రైతుల వైపే నిలబడుతుందని, నాణ్యమైన విద్యుత్ అందిస్తూ తాగు, సాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>