కలం, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీలకు ఇంతకాలం ట్రెజరీలతో ఉన్న పేమెంట్స్ చిక్కులు తొలగిపోయాయి. సొంతంగా ఆర్జించిన ఆదాయాన్ని ఇకపైన ట్రెజరీలో చెల్లించాల్సిన అవసరం లేకుండా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయడంతో శుక్రవారం గెజిట్ జారీ అయింది. తక్షణం ఈ విధానం అమల్లోకి రానున్నది. గెజిట్ ద్వారా ఈ నూతన సదుపాయం గత నెల 9వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నవంబర్ నుంచి ఫలితాలు అందనున్నాయి. ఉత్తర్వులు వెలువడడంపట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు
గ్రామపంచాయతీలు సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయాన్ని (Panchayat Funds) ఇకపై ట్రెజరీలో జమచేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఓపెన్ చేసుకున్న బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకోవచ్చు. ఇంతకాలం సొంత ఆదాయాన్ని సైతం ట్రెజరీ ద్వారా ఖర్చు చేయాల్సి రావడంతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయడంలో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సొంతంగా ఆర్జించిన నిధులు ఉన్నప్పటికీ ట్రెజరీ దయాదాక్షిణ్యాలపై ఆధారాపడాల్సి వచ్చేది. చెక్కులు క్లియర్ కాకపోవడంతో తరచూ కొత్తవాటిని ఇష్యూ చేయాల్సి వచ్చేది. ఆర్థిక సంవత్సరం మారినప్పుడు అవి చెల్లుబాటు కాక ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు చట్ట సవరణతో అలాంటి చిక్కులకు పరిష్కారం లభించినట్లయింది.
అత్యవసర పనులకు వెంటనే చెల్లింపులు
గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు తదితరాలకు వెంటనే నిధులను మంజూరు చేసి పనులను పూర్తి చేయడం అత్యవసరమైనవిగానే ఉంటున్నాయి. కానీ, ట్రెజరీ నుంచి పేమెంట్స్ ఆలస్యం కావడంతో పనులు పెండింగ్లో పడుతున్నాయన్నది సర్పంచ్ల ఆవేదన. పలుమార్లు ఈ విషయాన్న మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సొంత ఆదాయాన్ని వేగంగా వినియోగించుకునేలా చూడాలని కోరారు. గ్రామాల్లో రోడ్లు, ఇతర స్థానిక అవసరాల కోసం కూడా ట్రెజరీ నుంచి నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది.
మంత్రి చొరవతో గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వావలంబన పెరిగేలా ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన మరింత వేగంగా జరిగే అవకాశం ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి గ్రామపంచాయతీలే మరింత బాధ్యతతో నిర్ణయాలు తీసుకునేలా, స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను పెంచే దిశగా ఈ చట్ట సవరణ కీలక అడుగుగా ఉంటుందని, పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

