తెలంగాణలో వచ్చేది బీసీ ప్రభుత్వమే: తీన్మార్ మల్లన్న

కలం, చౌటుప్పల్: రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణలో 2028లో బీసీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తొలి బీసీ ఎమ్మెల్యే గెలవడం ఖాయమన్నారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 44వ రోజు పాదయాత్ర మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రసంగించి రెడ్డి, వెలమ నేతల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీసీల జీవితాల్లో మార్పు రాలేదు..

సెప్టెంబర్ 17న గోల్కొండ ఖిల్లా వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోందని తీన్మార్ మల్లన్న తెలిపారు. రెడ్డి, వెలమ నాయకులతో బీసీలకు ఇక పొత్తు అవసరం లేదన్నారను. వారితో సోపతి చేయడం వలన వారి ఆస్తులే పెరిగాయి తప్ప బీసీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది బీసీలకు, దొరలకు మధ్య జరుగుతున్న విడాకుల పంచాయితీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు పథకాల పేరిట ఖర్చు చేసిన రూ. 2,47,000 కోట్లు ధనిక వర్గాలకే లాభం చేకూర్చాయని మండిపడ్డారు. కులగణన లెక్కల ప్రకారం ఒక్కో రెడ్డి కుటుంబానికి సగటున రూ. 5,94,000 లబ్ధి చేకూరితే.. యాదవులకు రూ. 3.5 లక్షలు, ముదిరాజులకు రూ. 2.45 లక్షలు, గౌడులకు రూ. 2.23 లక్షలు మాత్రమే దక్కాయని లెక్కలతో సహా వివరించారు.

వారికే ప్రభుత్వ సబ్సిడీలు..

భూమి ఎవరి వద్ద ఎక్కువ ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు వారికే చేరుతున్నాయని తీన్మార్ మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మాట తప్పిందని దుయ్యబట్టారు. మూడేళ్లలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతా రూ.58వేల కోట్ల బీసీల నిధులను దారి మళ్లించి దోపిడీ చేశారని ఆరోపించారు. స్కాలర్‌షిప్‌లు, పాఠశాలల భవనాలు, గీత కార్మికులు, చేనేత నిధుల్లో భారీగా కోతలు విధించారని మండిపడ్డారు.

1949లో నిజాం జారీ చేసిన ‘ఫస్లీ 1358’ జాగీర్దారీ రద్దు చట్టం ప్రకారం భూములన్నీ పేదలకే చెందాల్సి ఉండగా, అప్పటి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బీసీల భూములను దొరలు, రెడ్లు ఎక్కించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాగానే ఈ చట్టం ఆధారంగా రెడ్లు, వెలమల వద్ద ఉన్న కోటి ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని పేద బీసీలకు పంచుతామని స్పష్టం చేశారు.

మునుగోడులో బీసీ జెండా ఎగరాలి..

మునుగోడులో 2.52 లక్షల ఓట్లలో 1.37 లక్షలకు పైగా బీసీ ఓట్లు ఉన్నప్పటికీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోవడం విచారకరమని తీన్మార్ మల్లన్న అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు బీసీ నాయకులను తొక్కేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్ హమారా.. రాజ్ తుమారా.. నై చలేగా!’ అని స్పష్టం చేస్తూ, 2028లో బీసీ సీఎంతో పాటు మునుగోడులో బీసీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీసీల ప్రతినిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి పాలకూరి అశోక్ సార్‌ను కత్తెర గుర్తుపై బరిలోకి దించినట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. పట్టభద్రులు ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల హనుమాండ్లు, బందారపు నరసయ్య గౌడ్, పిట్టల శంకర్, కొమ్మల ప్రవీణ్ రాజ్, జాతీయ ఇన్‌ఛార్జి పూజిత, సునీత, లింగం యాదవ్, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>