నేలకొండపల్లిలో ప్రాచీన మానవ నివాస ఆనవాళ్లు.. వెలుగులోకి ఆధారాలు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి (Nelakondapalli) పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవ నివాసానికి (Ancient Human Settlement) సంబంధించిన పలు ఆసక్తికరమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో నిర్వహిస్తున్న పురావస్తు అన్వేషణ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేలకొండపల్లి సమీపంలోని బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు ప్రాంతాల్లో వారసత్వ శాఖ బృందం చేపట్టిన ఉపరితల సర్వేలో ప్రాచీన నివాస స్థల ఆనవాళ్లు, ఇటుక నిర్మాణాలు లభ్యమైనట్లు తెలిపారు. రాష్ట్ర వారసత్వ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ పి. నాగరాజు నేతృత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్లు బి. మల్లు నాయక్, బి. గంగాదేవి, సైట్ సూపర్‌వైజర్ అశ్విన్ కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తిలతో కూడిన బృందం నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు ఈ అన్వేషణ చేపడుతోందని వెల్లడించారు.

​ఈ క్షేత్రస్థాయి సర్వేలో నాటి ప్రజల దైనందిన జీవితం, కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు విలువైన వస్తువులను గుర్తించి సేకరించారు. వీటిలో మట్టి పూసలు, బండి చక్రం, రాతి రోకలితో పాటు ఎరుపు రంగు మృణ్మయ పాత్రల పెంకులు, నలుపు-ఎరుపు రంగుల పాత్రలు, ఎరుపు పూత కలిగిన, నలుపు మెరుగు కలిగిన పాత్రల పెంకులు లభించాయి. సేకరించిన పాత్రల పెంకులపై పుష్పాలంకరణలు, బొటనవేలి ముద్రలు, తాడు ఆకారపు అలంకరణలు, పౌరాణిక ఆకృతులు, ముద్రిత డిజైన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఆనాటి ప్రజల తయారీ సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి కీలక ఆధారాలుగా నిలవనున్నాయి.

​అలాగే బైరాగులగుట్ట పరిసరాల్లోని ప్రాచీన నివాస స్థలంలో రెండు ఇటుక నిర్మాణాల అవశేషాలను గుర్తించి, వాటిలో కొంత భాగాన్ని బృందం వెలికితీసింది. ఈ నిర్మాణాల శైలి, ఇటుకల పరిమాణం, అమరికపై మరింత శాస్త్రీయ పరిశోధన చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ​తెలంగాణ చరిత్రలో నేలకొండపల్లి (Nelakondapalli) ఒక ముఖ్యమైన చారిత్రక, పురావస్తు కేంద్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

తాజా ఆధారాలు ఈ ప్రాంత ప్రాచీన చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. శాస్త్రీయ డాక్యుమెంటేషన్ ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు నేలకొండపల్లి మండల తహసీల్దార్ రాంప్రసాద్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు, పురావస్తు అన్వేషణ బృందం సభ్యులు పాల్గొన్నారు.

Also Read : వైభవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>