కలం, బోనకల్లు: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో బోనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన చేతిపంపును గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి కొండ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలగిపోవడం సంతోషకరమని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ విద్యాసంస్థలకు సహకారం అందించడాన్ని ఆమె కొనియాడారు.
గ్రేస్ సర్వీస్ సొసైటీ (GSS) ప్రతినిధి బి. ఎర్నెస్ట్ పాల్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య ఎంత ముఖ్యమో, ఆరోగ్యానికి స్వచ్ఛమైన తాగునీరు కూడా అంతే ముఖ్యమని, ఈ ఉద్దేశంతోనే కళాశాలలో చేతిపంపును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి మౌలిక అవసరాల కల్పనకు తమ సంస్థ కృషి కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ, పంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి, ఉప సర్పంచ్ కొండా, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధ్యాపకులు జోనతాన్ బాబు, మోహన్, రాజేంద్ర కుమార్, లక్ష్మీకాంతం, పద్మావతి, రామకృష్ణ, రమేష్, రాజేంద్ర, తిరుపతి రావు, ప్రియ కుమార్ రెడ్డి, మురళీకృష్ణ, యశోద, శాంతి ప్రియ, యూడీసీ మదర్ సాహెబ్, జశ్వంత్, బుజ్జమ్మ, అరుణ, జీఎస్ఎస్ ప్రతినిధులు జాను, ఎస్. నరేష్, పంచాయతీ సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

