కలం, ఖమ్మం బ్యూరో: వినియోగదారులకు సరుకులను నిర్ణీత తూకం కంటే తక్కువగా విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు స్థానిక వ్యాపారుల్లో కలకలం రేపాయి. పట్టణంలోని బాబుక్యాంప్, పెద్దబజార్ ప్రాంతాల్లోని బియ్యం దుకాణాలు, కిరాణా జనరల్ స్టోర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా పలు బియ్యం బస్తాలను క్షుణ్ణంగా తూకం వేసి పరిశీలించగా విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 కిలోల బరువుగా లేబుల్‌పై పేర్కొన్న బస్తాల్లో వాస్తవానికి కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నట్లు తేలడంతో, సంబంధిత వ్యాపారులపై మొత్తం 6 కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ మీడియాతో మాట్లాడుతూ… ప్రతి వ్యాపారి తాము విక్రయించే ప్యాకింగ్ సరుకులపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, లేబుల్‌పై ప్రకటించిన బరువుకు ఏమాత్రం తక్కువ కాకుండా వినియోగదారులకు అందజేయాలని స్పష్టం చేశారు. బస్తాలపై లేదా ప్యాకెట్లపై పేర్కొన్న బరువు కంటే తక్కువగా సరుకులు విక్రయించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రజలు సైతం మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్యాకెట్లపై ముద్రించిన నికర బరువును, తూకాన్ని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. వ్యాపారులు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పారదర్శక వ్యాపారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జిల్లావ్యాప్తంగా తనిఖీల పర్వం నిరంతరం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.

