పంటలు ఎండబెడుతున్న సీఎం రేవంత్: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణలో వచ్చిన కరువు ప్రకృతి ప్రకోపంతో వచ్చిన అతివృష్టి లేదా అనావృష్టి కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఏర్పడిన ‘రేవంత్ వృష్టి’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో విద్యుత్ కోతలు, సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి పంట పొలాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌‌తో కలిసి పరిశీలించారు.

అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నదుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పంపింగ్ మోటార్లు ఆన్ చేయక పంటలను ఎండబెట్టిన అసమర్థ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల నీటిని ఎత్తే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 18 టీఎంసీలే ఎత్తి, మిగిలిన గోదావరి జలాలను పట్టిసీమకు వదిలేశారని మండిపడ్డారు.

25 లక్షల ఎకరాల్లో పంట నష్టం..

రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు రోధిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. బడ్జెట్‌లో రూ.1,600 కోట్లు కేటాయించి అసెంబ్లీలో బల్లలు చరిచారని, మూడేళ్లు కావస్తున్నా పంటల బీమాను అమలు చేయకుండా రైతుల గుండెలపై తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అందించిన రైతుబీమాను నిలిపివేసి, ‘ఇందిరమ్మ బీమా’ పేరుతో నవంబర్ 19 నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామనడం రైతులకు చావు కబురు చల్లగా చెప్పడమేనని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలు ఏమయ్యాయని నిలదీశారు. ఎండిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చి, పెండింగ్ రైతుబంధు విడుదల చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పోరాడుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>