గౌరవెల్లి పూర్తి చేసి హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

​కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల నాయకత్వంలో గౌరవెల్లి ప్రాజెక్టును (Gouravelli Project) సత్వరమే పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​2007లో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మంజూరు చేసుకోవడంతో పాటు, సుప్రీంకోర్టులోని చట్టపరమైన చిక్కులను క్లియర్ చేసుకున్నామని మంత్రి వెల్లడించారు.

కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నామని, పనుల వాస్తవాలను ప్రజలు గమనించాలని కోరారు. కాలువల ద్వారా గ్రామాలకు సాగునీరు అందించేందుకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కవలలుగా పూర్తి చేస్తామని, గండిపల్లి ద్వారా 14 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. అదేవిధంగా ఎల్కతుర్తికి ఎస్ఆర్ఎస్పీ, భీమదేవరపల్లికి దేవాదుల, హుస్నాబాద్‌కు గౌరవెల్లి, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు మిడ్ మానేరు ఫేజ్-3 ద్వారా సాగునీరు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

​సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి తెలిపారు. నియోజకవర్గానికి గత ఏడాది 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ప్రస్తుతం మరో 2,000 ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి బూత్‌కు 8 ఇళ్లు (ప్రతి 200 ఓట్లకు ఒక ఇల్లు) చొప్పున పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు, రోడ్డు విస్తరణలు, పారిశ్రామిక కారిడార్‌లో ఇళ్లు కోల్పోయిన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ దీపావళి వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లలోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

​నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు, రూ. 5 లక్షల “ఇందిరమ్మ బీమా పథకం” ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు నియోజకవర్గంలో 136 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు దళారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. నిరుద్యోగ యువత కోసం రాబోయే జనవరిలో మెగా జాబ్ మేళా, అనంతరం రైతు మేళా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి మండలాల వారీగా దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పొలాలకు దారులు కావాల్సిన రైతులు దరఖాస్తు చేసుకుంటే ఉపాధి హామీ పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు.

​నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరుగుతోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి, బస్తీ దవాఖాన, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ఎల్కతుర్తికి కోర్టు, భీమదేవరపల్లికి విజ్ఞాన కేంద్రం, చిగురుమామిడికి ఆయిల్ ఫామ్ నర్సరీ మంజూరయ్యాయని వెల్లడించారు. ఎల్లమ్మ చెరువు, కరీంనగర్-కొత్తపల్లి మార్గాల్లో 4 లైన్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

​హుస్నాబాద్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు కోహెడ చెరువు వద్ద డంప్ యార్డు తొలగించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి చేస్తూనే, ప్రతి గ్రామంలో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో కోర్టుల ఏర్పాటుకు రూ. 1 లక్ష చొప్పున విడుదల చేస్తున్నామన్నారు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో రాతి గర్భగుడి నిర్మిస్తూ, కొత్తకొండ వీరభద్రస్వామి, పొట్లపల్లి రాజేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గ్రామాల్లో బతుకమ్మ ఘాట్లు నిర్మిస్తామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>