వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణ.. అధికారులకు కీలక ఆదేశాలు!

కలం,‌ జోగులాంబ గద్వాల: ఎల్ నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ మధుమోహన్ (Madhu Mohan) అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై సమీక్షించారు.

పీఎం శ్రీ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ప్రత్యేక కార్యాచరణతో తగు చర్యలు చేపట్టాలన్నారు. చేతిపంపుల మరమ్మత్తులు, పైప్ లైన్స్ లీకేజీలను అరికట్టడం వంటి పనులను చేయించాలన్నారు. వీబీ జీరాంజీ పథకంలో భాగంగా ప్రస్తుత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

ఈ ఏడాదిలోనే అత్యధికంగా ఇటీవల 5.38 లక్షల కూలీలకు ఉపాధి పనులు కల్పించిన రికార్డు రావడం గర్వకారణం అన్నారు. జలసిరి పనులను ఎక్కువగా చేపట్టడం వలన నీటి సంరక్షణకు కృషి చేయవచ్చన్నారు. ఆసరా పెన్షన్ల దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇళ్లల్లో గృహప్రవేశం చేసిన లబ్ధిదారులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు దీపావళి వేడుకల్లో పాల్గొనాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర అవసరాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నర్సింగరావు, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ.. జిల్లాలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేశామని, అవార్డు పాసైన రైతులకు సత్వరమే డబ్బులు చెల్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున ప్రజలకు తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. రబీ సీజన్‌లో రైతులు తమ బోరు బావుల్లో నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>