కలం, వెబ్డెస్క్: ఏపీలో మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన తీవ్ర కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల (Kurupam Tribal Gurukul School)లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరుగగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం పాఠశాలలో ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. సమీప ఆస్పత్రి నుంచి వైద్యులను తీసుకొచ్చి ఒక తరగతి గదిలో విద్యార్థులకు చికిత్స అందించారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన వివరాలు ఏమీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైసీపీ మహిళా నేత పుష్ప శ్రీవాణి గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

