కలం, మునుగోడు: చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి (Thummalapalli) గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వారికి ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే బోధన అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాఠశాలకు వంటగది లేకపోవడంతో మధ్యాహ్న భోజనం తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
మరోవైపు పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో చుట్టుపక్కల నుంచి పాములు, ఇతర విషపూరిత జీవులు పాఠశాల పరిసరాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై, అయినప్పటికీ తుమ్మలపల్లి పాఠశాలలో వంటగది, ప్రహరీ గోడ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం విచారకరమంటున్నారు.
సంబంధిత విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పాఠశాలకు వంటగది నిర్మించడంతో పాటు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టి, పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

