కలం, వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి (Undavelly Accident) మండలం అలంపూర్ చౌరస్తా వద్ద గల 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణం మధ్యలో ఉన్నట్టుండి బస్సు ముందు టైర్ హఠాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బస్సు రహదారి మధ్యలోని డివైడర్‌ను తీవ్రంగా ఢీకొట్టి, డివైడర్ దాటుకుని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. అదృష్టవశాత్తూ ఎదురుగా వేరే వాహనాలేవీ రాకపోవడంతో పాటు బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ఈ ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీదేవి (60) అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు.స మాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన లక్ష్మీదేవిని 108 అంబులెన్స్‌లో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

