కలం, స్పోర్ట్స్ : ది హండ్రెడ్ 2027 (The Hundred 2027) సీజన్‌కు ముందు ఎంఐ లండన్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పదవి ఖాళీ కానుంది. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్(Kieron Pollard) ఈ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గతంలో మహేళ జయవర్ధనే నిష్క్రమించడంతో 2026 సీజన్‌లో పొలార్డ్ ఎంఐ లండన్ బాధ్యతలను స్వీకరించారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కూడా ఉన్న ఆయన, కేవలం ఒక్క సీజన్ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత కోచింగ్ బాధ్యతల నుంచి కొంతకాలం విరామం తీసుకోనున్నారు.
సామ్ కర్రన్ కెప్టెన్సీలో 2026 సీజన్ ఆడిన ఎంఐ లండన్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌తో సమానమైన పాయింట్లు సాధించినప్పటికీ, రన్‌రేట్ తక్కువగా ఉండటంతో నాకౌట్ అవకాశం చేజారింది. పొలార్డ్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన గారెత్ బ్యాటీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా మారడంతో ఎంఐ లండన్ జట్టు మేనేజ్‌మెంట్‌లో పెద్ద మార్పులే చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు ఎంఐ లండన్ మహిళల జట్టు గత సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న లిసా కేట్లీ ఈ జట్టు కోచ్‌గా తిరిగి వస్తారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఇతర జట్లలో కూడా కోచింగ్ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తమ హెడ్ కోచ్ షేన్ బాండ్‌ను తొలగించగా, కొత్త కోచ్ కోసం జొనాథన్ ట్రాట్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు ది హండ్రెడ్ రిటెన్షన్ విండో తెరుచుకుంది. 2027 సీజన్ కోసం ప్రతి జట్టు ఐదో విదేశీ ప్లేయర్‌ను స్క్వాడ్‌లో చేర్చుకోవడానికి అనుమతించినప్పటికీ, తుది జట్టులో నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది.

