కలం, యాదగిరిగుట్ట: ఒకవైపు మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పలు.. మరోవైపు ఆకాశంలో అకాల వర్షాల భయం.. ఇంకోవైపు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులు.. ఇదీ యాదగిరిగుట్ట మండలంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రాల దుస్థితి. మార్కెట్ కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయించడంలో మాత్రం ఎందుకు విఫలమయ్యారని సీపీఎం మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్ (Gaddam Venkatesh) తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. గురువారం గౌరాయపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఆయన, అక్కడ ధాన్యం విక్రయాల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలవ్యాప్తంగా ఇప్పటికే 50 నుంచి 60 శాతం మంది రైతులు వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారని, సుమారు 20 రోజులుగా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవాలకు ఉన్న తొందర.. కొనుగోళ్లకు ఎందుకు లేదు? మార్కెట్ యార్డుల్లో బస్తాలు ఉన్నాయి.. తేమశాతం పరీక్షించే యంత్రాలు ఉన్నాయి.. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు మాత్రం సాగడం లేదని విమర్శించారు. రైతుల ధాన్యం మార్కెట్ యార్డుల్లోనే ఉండిపోతే దానికి బాధ్యత వహించేది ఎవరు? అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతే రైతులకు ఎవరు పరిహారం చెల్లిస్తారని నిలదీశారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు మరోవైపు ధాన్యం విక్రయాల కష్టాలు వెంటాడుతున్నాయని అన్నారు. యాదగిరిగుట్ట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినా, కరువు నివారణ చర్యలు, పంట నష్టాల అంచనా, నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అన్నదాత కష్టాలు పాలకులకు కనిపించడం లేదా? రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని, మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బబ్బులు శ్రీనివాస్, శాఖ కార్యదర్శి ఇంజ లింగం, వడ్లకొండ భాస్కర్, రైతులు బేతాళ సత్యనారాయణ, బైర శీను, బైర విజయ్, బైర శ్రీశైలం, బైర ఎల్లవ, బైర వెంకటమ్మ, బైర మంజుల, నాగపురి నాగరాజు, పల్లపాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

