కలం నల్గొండ: నల్గొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ణు సూపర్ స్మార్ట్ సిటీగా మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కథాల్ గూడ వద్ద రూ.10 కోట్ల తో కథాల్ గూడ నుండి రాజీవ్ గృహకల్ప వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో హెచ్ఎం రోడ్లను చేపట్టామని దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి రోడ్లు వేయడం లేదన్నారు. మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు, గ్రామాల నుండి మండల కేంద్రాల వరకు డబుల్ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. సుమారు 9,000 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మిస్తున్నామని, నల్గొండ జిల్లాలో రూ.2,000 కోట్లతో డబుల్ రోడ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు 6 లైన్ల రహదారిగా , కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటికి నల్లాలు, 24 గంటలు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వీటన్నిటిని రానున్న ఒకటిన్నర సంవత్సరాలలో పూర్తి చేస్తామని వెల్లడించారు.రోడ్లతో పాటు, నల్గొండ పట్టణంలో పేదవారికి ఇళ్ల కేటాయింపులో భాగంగా హౌసింగ్ బోర్డు పక్కనే స్థలాన్ని కేటాయించామని, జీ ప్లస్ త్రీ మోడల్లో 500 గృహాలను ఇల్లు లేని పేదలకు కట్టించి ఇస్తామని మంత్రి వెల్లడించారు.అంతకు ముందు మంత్రి భవిత కేంద్రం ఆవరణలో రూ.17 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సమీకృత మండల కాంప్లెక్స్ భవన సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గణేష్, ఆర్డీవో అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి,వంగూరి లక్ష్మయ్య, దండంపల్లి పరుశురాం, దాసరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

