కలం, వనపర్తి: జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) అన్నారు. వనపర్తి పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank) నూతన శాఖను గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి (Wanaparthy) జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి శాఖ ఏర్పాటు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ శాఖ ద్వారా రైతులు, వ్యాపారులు, మహిళలు, యువతకు మెరుగైన ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ, విద్యా, గృహ, వాహన రుణాలతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను అర్హులైన వారందరికీ సులభంగా అందించాలని బ్యాంకు అధికారులకు సూచించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతూ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని బ్యాంకు ఉన్నతాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ ఎం. పిచయ్య, రీజినల్ హెడ్ జి.ఎస్. చౌహాన్, వనపర్తి బ్రాంచ్ హెడ్ రామావత్ చంద్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా జనరల్ సెక్రటరీ బ్రహ్మంచారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

