కలం, సినిమా: పాన్ ఇండియా మూవీస్ వచ్చాక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి ఒక రేంజ్‌లో పెరిగిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనేది టాలీవుడ్ హీరోయిన్ల కలగా ఉండేది. కానీ, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ కూడా తెలుగు, తమిళ సినిమాల్లో నటించేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇటీవల బీ టౌన్ భామలు రాధికా ఆప్టే (Radhika Apte ), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్ సినిమాలపై చేసిన కామెంట్లు మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య చిచ్చు రేపాయి. తాజాగా ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regena Cassandrra) స్పందించారు. ఓ తమిళ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జాన్వీ, రాధిక చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. యాక్టర్లకు సినిమా, స్క్రిప్ట్ నచ్చకపోతే ఎప్పుడైనా వాకౌట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇది మేల్, ఫీమేల్ ఎవరికైనా వర్తిస్తుందని అన్నారు. జాన్వీ, రాధికాలను బలవంతం చేసి సినిమా చేయలేరు కదా? అని ప్రశ్నించారు.
ఇక జాన్వీ ఇష్యూ పై స్పందిస్తూ.. జాన్వీ పెద్ది సినిమాలో తనను ఆబ్జెక్టిఫై చేసినట్లు జాన్వీ కరణ్ జోహార్ షోలో కామెంట్స్ చేసిందన్నారు. సౌత్‌లో ముందుగా స్క్రిప్ట్ అందకపోవడం నిజమైన సమస్యేనని చెప్పారు. సౌత్ ఇండస్ట్రీల్లో కొన్నిసార్లు షూటింగ్ రోజు ఉదయం 6 గంటలకు మాత్రమే యాక్టర్లకు సీన్లు ఇస్తారని తెలిపారు. అయితే ముంబైలోని హిందీ చిత్ర పరిశ్రమలో షూటింగ్ కాల్‌షీట్లు, సీన్స్, టెక్నికల్ టీమ్ వివరాలతో సహా ముందుగానే ప్లాన్ చేసి ఉంటాయని వివరించారు. అసౌకర్యంగా అనిపిస్తే సినిమాను రిజెక్ట్ చేయడం లేదా మధ్యలోనే వదిలేసే హక్కు జాన్వీకి ఉందని రెజీనా పేర్కొన్నారు. జాన్వీ తనకు ఇబ్బంది కలిగినప్పుడు నో చెప్పే అవకాశమే లేదనడం సరికాదన్నారు.
అలాగే రాధికా ఆప్టే బాలకృష్ణతో సినిమా చేసినప్పుడు నచ్చకపోతే అప్పుడే చేయనని చెప్పి వెళ్లాల్సిందని చెప్పారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఏ హీరోయిన్ అయినా సినిమా చేస్తున్న సమయంలో మాట్లాడి న్యూస్ చేయాలి కానీ, సినిమా చేసుకొని అవసరం తీరిపోయాక ఇలాంటి కామెంట్స్ చేయొద్దన్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ ఇలా మాట్లాడుతూ.. సౌత్, నార్త్ మధ్య విబేధాలు క్రియేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. హీరోయిన్లతో బలవంతంగా ఎవరూ సినిమాలు చేపించరని కామెంట్ చేశారు. అదే సమయంలో సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో వివక్ష, చిన్నచూపును ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు తన పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌ను రెజీనా మీడియాతో షేర్ చేసుకున్నారు. అక్షయ్ కుమార్‌తో తాను నటించిన కేసరి చాప్టర్ 2 మూవీలో తాను పార్వతి నాయర్ పాత్ర పోషించినప్పటికీ, సినిమా ప్రమోషన్లలో కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. తన పేరును ప్రమోషన్ల నుంచి తొలగించారని, తాను నటించిన పాటను విడుదల చేసినప్పటికీ కనీసం తనను ట్యాగ్ చేయలేదని వెల్లడించారు. తాను సౌత్ ఇండియన్ అయినందుకే అలా చేశారా? అని ప్రశ్నించారు. అందుకే బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే తాను అంగీకరించనని రెజీనా అన్నారు. జాన్వీ కపూర్‌కి బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి తాను పెద్ది సినిమాలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడిందని, మరి ధర్మ ప్రొడక్షన్స్ వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి ఎవరు ప్రశ్నిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ విషయం గురించి పెద్దగా బాధ పడటం లేదని, కానీ, నార్త్, సౌత్ ఇండస్ట్రీలను డివైడ్ చేసే విధంగా హీరోయిన్లు కామెంట్ చేయడం సరికాదని చెప్పారు.

