దత్తల బాలుడి వ్యవహారంలో మరో ట్విస్ట్.. హైకోర్టులో కలెక్టర్ అప్పీల్!

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన దత్తత బాలుడి (Child Adoption) వ్యవహారంలో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. చట్టబద్ధంగా నిబంధనలు పాటించలేదనే కోణంలో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు న్యాయస్థానాల మధ్య తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. పెంచుకున్న దంపతులకు బాలుడిని అప్పగించాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, సీడబ్ల్యూసీ అధికారులు ఉమ్మడిగా హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.

​అసలేం జరిగింది?

​జగిత్యాలకు చెందిన కాసరపు సరిత, శ్రీనివాస్ దంపతులు 2023లో ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు. అయితే ఈ దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేవంటూ అందిన ఫిర్యాదుల ఆధారంగా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలుడిని స్వాధీనం చేసుకుని, సీడబ్ల్యూసీ కేంద్రానికి తరలించారు. ​అధికారుల చర్యను సవాలు చేస్తూ సరిత-శ్రీనివాస్ దంపతులు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అక్టోబర్ 16న బాలుడిని తిరిగి పెంచుకున్న తల్లిదండ్రులకే అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత బాలుడిని తీసుకెళ్లే సమయంలో చోటుచేసుకున్న భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తీర్పును అమలు చేస్తూ అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

కలెక్టర్, డబ్ల్యూసీడీ పిటిషన్‌తో మళ్లీ వేడెక్కిన వ్యవహారం

​సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం తరఫున కలెక్టర్ సత్యప్రసాద్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ లో కేవలం హిందూ సంప్రదాయాల ప్రకారమో లేదా అనధికారికంగానో దత్తత తీసుకుంటే దానికి చట్టబద్ధత రాదని, దత్తతకు సంబంధించి ఎటువంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేవని అధికారులు హైకోర్టుకు తెలిపారు.

​ఆధారాలు సరిగ్గా పరిశీలించలేదు

విచారణ సందర్భంలో సీడబ్ల్యూసీ అధికారులు సమర్పించిన నిబంధనలు, కీలక ఆధారాలను పరిశీలించకుండానే గతంలో అప్పగింత ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొన్నారు.

​విచారణకు ఆటంకం

బాలుడు పెంచుకున్న తల్లిదండ్రుల వద్దే ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆటంకం కలుగుతుందని, కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించే వరకు బాలుడిని తిరిగి బాలల సంక్షేమ కేంద్రానికి తరలించాలని కోరారు.

​హైకోర్టులో విచారణ వాయిదా

ఈ అప్పీల్ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది. దీంతో ఈ సున్నితమైన, భావోద్వేగంతో కూడుకున్న దత్తత వ్యవహారంలో హైకోర్టు బెంచ్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతోందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>