కలం, వెబ్ డెస్క్: వ్యక్తిని నిర్బంధించే విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 22 ప్రకారం, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న నిమిషం నుంచి 24 గంటల్లోగా కచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ చంద్రుర్కర్తో కూడిన ధర్మాసనం అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం వంటి అంశాలతో స్పష్టతనిచ్చింది. ఒక వేళ వ్యక్తిని 24 గంటల తరువాత కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చకపోతే వెంటనే విడుదల చేయాల్సిందేనని పేర్కొంది.
అరెస్టయిన ప్రాంతం నుంచి కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ప్రయాణ సమయానికి మాత్రమే మినహాయింపు ఉంటుందని.. మిగతా అంశాలకు ఏమాత్రం ఆస్కారం ఉండబోదని ధర్మాసనం వివరించింది. బీఎన్ఎస్ సెక్షన్ 28 ప్రకారం, ఒక వ్యక్తిని నిర్బంధించిన 24 గంటల్లో కూడా వీలైనంత త్వరగానే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే బాధ్యత విచారణ అధికారే స్వీకరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
హై కోర్టుల తీర్పులపై కూడా..
ఒడిశా, మద్రాస్, కేరళ హైకోర్టులు పలు సందర్భాల్లో ఆర్టికల్ 22ను విశ్లేషిస్తూ ఇచ్చిన తీర్పులు సరైన న్యాయ సూత్రాలను పాటించలేదని సుప్రీం కోర్టు (Supreme Court) అభిప్రాయడింది. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో అతడి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొంది. అదుపులోకి తీసుకున్న సమయం, తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని.. ఈ విషయాన్ని మెజిస్ట్రేట్లు, పై కోర్టులు తప్పనిసరిగా పరిశీలించాలని వివరించింది. కేసు పరిస్థితుల కారణంగా నిర్బంధించడం అనేది పరిమితికి మించిపోయిందా.. లేదా.. అనేది చెక్ చేయాలని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. 24 గంటల కంటే ఎక్కువ సమయం నిర్బంధం కొనసాగిందని భావిస్తే.. రిమాండ్ తిరస్కరించవచ్చని కూడా చెప్పారు.
Also Read : కిలో రూ.1.23 లక్షలా? జైపూర్లో ఊరిస్తున్న ఆ స్వీట్ ఏంటి?
Follow Us On: X(Twitter)

