కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు రాగల కొన్ని గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ములుగు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
మరోవైపు ఏపీలోనూ వాతావరణం ఉధృతంగా మారింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

