కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ. చక్రపాణి (83) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2007లో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత చక్రపాణి (Chakrapani) దానికి తొలి ఛైర్మన్గా వ్యవహరించారు. దాదాపు దశాబ్దకాలం పాటు మండలి ఛైర్మన్గా సభా వ్యవహారాలను నిర్వహించారు.
ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చక్రపాణి, సుదీర్ఘకాలం పాటు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించి శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని పలువురు నేతలు కొనియాడారు.
డాక్టర్ చక్రపాణి (Chakrapani) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మండలి చైర్మన్గా చక్రపాణి అందించిన సేవలు, పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల ఆయనకు ఉన్న గౌరవం చిరస్మరణీయమని ఇరువురు సీఎంలు గుర్తుచేసుకున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీకి అంబటి కీలక వాంగ్మూలం
Follow Us On: Instagram

