గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించాలి: హుస్సేన్ నాయక్

కలం, ఉట్నూర్: జిల్లాలో అమరజీవి కుంరం సూరు (Kumram Sooru) 29వ వర్ధంతి వేడుకలను ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం ఉట్నూర్ మండలం కొలం గూడ గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు కుంరం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. భూ సమస్యలు, అటవీ హక్కుల గుర్తింపునకు సంబంధించి కోర్ ఏరియాలు, భూమి కేటాయింపులు, అటవీ ప్రాంత హక్కులపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గిరిజన బిడ్డలకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

గిరిజనులు తమకు లభించిన చట్టపరమైన హక్కులను, కోర్టుల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో కొలమ్ జాతికి చెందిన సుమారు 7,000 కుటుంబాలు ఉన్నాయని, 9 శాఖల ద్వారా పీఎం జన్మన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజనుడికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇండ్ల నిర్మాణాలు, పోడు భూముల సమస్యలు, అలాగే ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టంలోని కొలమ్, నివాసం, కమ్యూనిటీ అనే మూడు రకాల హక్కులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. త్వరలోనే అర్హులైన వారికి తగిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను అనుసరించాలని, వాటిని భావితరాలకు అందజేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు.  యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చదువుపై శ్రద్ధ వహించి ఉన్నతంక స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ అధికారులు, రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, సంఘ నాయకులు, కొలమ్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>