కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఉపాధి కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన వీబీజీ రామ్జీ (VB-G RAM G) ఉపాధి హామీ పథకంలో తెలంగాణ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 3 తారీఖున ఒకే రోజు 5 లక్షలకు పైగా కూలీలకు పని కల్పించి చరిత్ర నెలకొల్పింది. ఉన్నతాధికారులు ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూలీలకు మరిన్ని పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క అనసూయ ఆదేశించారు.
ఎల్ నినో దృష్ట్యా రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని సీతక్క సూచించారు. గ్రామాల్లో ఉపాధి కల్పిచడంతో గ్రామాల అభివృద్ధితోపాటు పల్లె ప్రజలకు ఉపాధికల్పించినట్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించాలని చెప్పారు. కూలీలకు నిరంతరం పని లభించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు పని, జల సంరక్షణ, గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించడమే ప్రధాన లక్ష్యాలుగా పనులు సాగాలని తెలిపారు.

