కలం, నిర్మల్ : ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) ఆదేశించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న ఉద్యానవన పంటలు, వాటి విస్తీర్ణం, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సూక్ష్మ సేద్య పద్ధతుల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని తగ్గించుకుంటూ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆదాయ అవకాశాలపై రైతులకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని తెలిపారు. తక్కువ నీటితో పంటలకు అవసరమైన తేమను అందించడం ద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతులను గుర్తించి, వారికి అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బిందు సేద్య పరికరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.

