కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కీలక సమీక్ష చేశారు. తుమ్మిడిహెట్టి (Thummidihatti) బ్యారేజీ విషయంలో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర టెక్నికల్ అంశాలతో కూడిన అధికారిక పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఇటీవల మహారాష్ట్ర సీఎంతో జరిగిన చర్చలను వివరించిన ముఖ్యమంత్రి.. ఇక నుంచి నిరంతరం సంప్రదింపులు చేపట్టాలన్నారు.
బ్యారేజీ కారణంగా మహారాష్ట్రలో ముంపు భూములకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చేందుకు అంగీకరించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అవసరమైన నిధులను రెండు రాష్ట్రాల జాయింట్ ఖాతాలో ఉంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ముంపు భూములకు సంబంధించి మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేపట్టినా.. తమకు అభ్యంతరం లేదన్నారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎత్తుపైనే అసలు సమస్య..
ప్రాణహిత నది(Pranahita River)పై తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగు నీరు ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్ర వైపు వందల ఎకరాలు ముంపునకు గురవుతాయనేది అక్కడి ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. 148 మీటర్ల వరకు ఓకే చెప్పినా.. ఆ ఎత్తులో నిర్మిస్తే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదు.
దీంతో మహారాష్ట్రను ఎలాగైనా 152 మీటర్లకు ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్ హయాంలో కూడా మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో.. చివరికి ప్రాజెక్ట్ డిజైన్లను మార్చేసి కాళేశ్వరం నిర్మించారు. అయితే తుమ్మిడిహెట్టి(Thummidihatti)ని నిర్మిస్తేనే సాగు, తాగు నీటి బాధలు పోతాయని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు కూడా జరిపారు.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On: Youtube

