కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా తల్లాడ – దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. సత్తుపల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తోంది. హైదరాబాద్ నుంచి తిరువూరుకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ మరొక వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, వివరాలను సేకరిస్తున్నారు.

