డీసీసీ పదవి పంచాయితీ.. ఎమ్మెల్యేకు మంత్రి వార్నింగ్​!

క‌లం, మెద‌క్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha), కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (Jukkal MLA Lakshmikantha Rao) మధ్య చెలరేగిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేను ఉద్దేశించి మంత్రి వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇండియా కూటమి ర్యాలీ కోసం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు బస చేసిన షాంగ్రిలా హోటల్ లాబీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. లాబీలో ఎదురుపడిన లక్ష్మీకాంతరావును ఉద్దేశించి మంత్రి దామోదర.. ‘‘అసలు ఏమనుకుంటున్నావ్.. డీసీసీలు ఇప్పిస్తున్నావట.. ఎవడికంటే వాడికి ఇప్పిస్తావా? నువ్వేమైనా పెద్ద సుల్తానా ?’’ అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. సహచర ఎమ్మెల్యేల సమక్షంలోనే ఓ సీనియర్ మంత్రి మరో ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అక్కడున్న వారిని షాక్కు గురిచేసింది.

డీసీసీ పదవితో చిచ్చు..

మంత్రి (Damodar Raja Narasimha) వర్సెస్ ఎమ్మెల్యే (Jukkal MLA Lakshmikantha Rao) వివాదానికి సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఈ పదవి కోసం జహీరాబాద్కు చెందిన ఉజ్వల్​ రెడ్డి, పటాన్​ చెరుకు చెందిన కాటా సుధారాణి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్​ రెడ్డి , ఎంపీ సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్​ తో పాటు మరికొందరి మధ్య పోటీ నడిచింది. మంత్రి దామోదర ఆశీస్సులతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మద్దతు ఉండటంతో ఉజ్వల్​ రెడ్డికి పదవి దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ఢిల్లీ పర్యటనలకు కూడా ఉజ్వల్ రెడ్డి వెళ్లివచ్చారు. అయితే చివరి నిమిషంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నియామకం వాయిదా పడింది. గతేడాది నవంబర్లో మిగతా జిల్లాల డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన అధిష్ఠానం.. సంగారెడ్డిని మాత్రం పెండింగ్లో పెట్టింది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మల జగ్గారెడ్డిని కొనసాగించింది.

షాకిచ్చిన అనుహ్య నిర్ణయం

డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆగస్టు నెలలో మరోసారి అధిష్ఠానం దూతలు జిల్లాకు వచ్చి పలువురు నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఉజ్వల్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. జిల్లాలోని కీలక నేతలు కూడా మంత్రి దామోదర వైపు నిలిచినట్లు ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబర్ 19న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అనూహ్య నిర్ణయం మంత్రితో పాటు జిల్లా ముఖ్య నేతలకు షాక్ ఇచ్చింది. మంత్రి మద్దతు, ఆశీస్సులు లేకుండానే ఈ నియామకం ఎలా జరిగిందన్న చర్చ అప్పట్లోనే మొదలైంది. ఈ నియామకమే ఢిల్లీ వేదికగా మంత్రి దామోదర, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య వివాదానికి కారణమైందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది.

పట్టు సడలిందన్న భయం!

తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డికి సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి దక్కడం మంత్రి దామోదర రాజనర్సింహకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తున్నది. ఏడాదిగా పెండింగ్లో ఉన్న నియామకం చివరకు తన మాటతో సంబంధం లేకుండా ఖరారు కావడంతో.. జిల్లాపై తన పట్టు సడలిందన్న భావనకు మంత్రి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

తనను నమ్ముకున్న నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురవడంతో పాటు, జిల్లా రాజకీయాలతో సంబంధం లేని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ నియామకంలో కీలకంగా వ్యవహరించడంపై దామోదర తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత వ్యక్తిగత సిబ్బంది సహకారం, ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ఉన్న పరిచయాలు చంద్రశేఖర్‌రెడ్డి నియామకానికి దోహదపడ్డాయన్న ప్రచారం కూడా ఈ అసంతృప్తికి ఆజ్యం పోసింది. ఈ పరిణామాలపై నిరుడు నుంచే రగులుతున్న అసంతృప్తి.. ఢిల్లీ వేదికగా భగ్గుమన్నది.

అవమానంగా భావించిన ఎమ్మెల్యే

ఢిల్లీలో జరిగిన ఈ వివాదం రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. తనపై మంత్రి తీవ్ర పదజాలం వాడటంపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నొచ్చుకున్నట్లు తెలుస్తున్నది. సహచర ఎమ్మెల్యేల ముందు తిట్టడాన్ని అవమానంగా భావించిన లక్ష్మీకాంతరావు.. ఈ వ్యవహారంపై తన అనుచరులు, సహచర ఎమ్మెల్యేల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్ లాబీలో జరిగిన మొత్తం వ్యవహారంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో జుక్కల్ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>