కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ (Sivar Venkatapur) గ్రామాల్లో ప్రభుత్వం ఆదేశించిన ల్యాండ్ రీ-సర్వే ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు రెండు గ్రామాల్లోని చెరువులు, కుంటల భూముల సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎర్రవల్లి గ్రామంలో సర్వేను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
అయితే, అనంతరం శివారు వెంకటాపూర్ గ్రామంలో సర్వే ప్రారంభించేందుకు అధికారులు వెళ్లగా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ గ్రామ సరిహద్దులను స్పష్టంగా చూపించిన తర్వాతే సర్వేను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ సర్వేను అడ్డుకున్నారు. ముఖ్యంగా, శివారు వెంకటాపూర్ పరిధిలోని 136 ఎకరాల భూవివరాలను పూర్తిస్థాయిలో తేల్చిన తర్వాతే రీ-సర్వే ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులతో గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో శివారు వెంకటాపూర్లో కొంతసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల ఆందోళనల మధ్యే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ ల్యాండ్ సర్వేను కొనసాగించారు.

