డిండి ఎత్తిపోతలే శాశ్వత పరిష్కారం: రాజగోపాల్ రెడ్డి

కలం, మునుగోడు: ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ బాధితులున్న మునుగోడు నియోజకవర్గానికి డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు. అడ్డంకులను తొలగించి త్వరలోనే నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందిస్తామన్నారు. ఎల్ నినో ప్రభావ నివారణ చర్యలు, నీటి వనరుల సంరక్షణపై మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సదస్సు నిర్వహించారు.

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి డిండి ప్రాజెక్టును మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అరకొర పనులతో వదిలేసింది. ఇప్పుడు వారే ధర్నాలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గంటల తరబడి చర్చించి ఏదుల రిజర్వాయర్ నుంచి మునుగోడుకు నీటిని తరలించాలని నిర్ణయించాం” అని తెలిపారు.

రైతులకు పరిహారం అందేలా..

డిండి నీరు వచ్చేలోపు స్థానిక చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసుకోవడానికి 300 చెరువులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన గత పాలకులు, ఫ్లోరైడ్ బాధిత మునుగోడులోని చెరువులను కాపాడుకోవడానికి నిధులు కేటాయించలేకపోయారని మండిపడ్డారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్ నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి పరిహారం అందేలా నివేదికలు పంపాలని కలెక్టర్‌ను కోరారు. సొంత రైతులనే కాకుండా కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రిని కాకపోయినా..

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మాట్లాడుతూ.. ‘నేను మంత్రిని కాకపోవచ్చు.. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపన, క్రెడిబిలిటీ నాకు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మునుగోడుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. చెరువుల పునరుద్ధరణకు, ఎల్ నినో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్, యాదాద్రి, నల్లగొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి భేటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>