కలం, స్పోర్ట్స్: దోహా వేదికగా జరగనున్న టోర్నీ కోసం అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ‘ఏ’ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రామ్ అలీఖిల్ (Ikram Alikhil)సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో జరుగుతుంది. అఫ్ఘానిస్థాన్ ‘ఏ’ జట్టు తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 19న శ్రీలంక ‘ఏ’తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 21న బంగ్లాదేశ్ ‘ఏ’తో, నవంబర్ 23న హాంకాంగ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. అఫ్గాన్ జట్టు గ్రూప్-ఎలో స్థానం సంపాదించింది.
ఈ గ్రూప్‌లో శ్రీలంక ‘ఏ’, బంగ్లాదేశ్ ‘ఏ’, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. మరో గ్రూప్‌లో ఇండియా ‘ఏ’, పాకిస్థాన్ ‘ఏ’, యూఏఈ, నేపాల్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ పోరు నవంబర్ 29న జరుగుతుంది. గత ఏడాది అఫ్ఘానిస్థాన్ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుని నాకౌట్ చేరలేకపోయింది.ఇక్రామ్ అలీఖిల్ ప్రధాన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో, మహమ్మద్ ఇషాక్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుస అర్ధసెంచరీలతో రాణించిన ఇజాజ్ అహ్మద్‌జాయ్‌కు చోటు దక్కింది. అలాగే ఇటీవల త్రిదేశ సిరీస్ ఆడిన ఫాస్ట్ బౌలర్ బిలాల్ సమీ కూడా జట్టులోకి వచ్చారు.వీరితో పాటు హసన్ ఈసాఖిల్, ఏఎం గజన్ఫర్, దర్విష్ రసూలీ, ఖైస్ అహ్మద్ వంటి ప్రముఖ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా అబ్దుల్లా తారాఖిల్, ఖాలిద్ తనివాల్, ఇజ్హరుల్హక్ నవీద్లను ఎంపిక చేశారు.
అఫ్ఘానిస్థాన్ ‘ఏ’ జట్టు:
ఇక్రామ్ అలీఖిల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), హసన్ ఈసాఖిల్, ఇమ్రాన్ మీర్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, దర్విష్ రసూలీ, ఫైసల్ ఖాన్ షినోజాదా, బహీర్ షా మహబూబ్, ఫర్మానుల్లా సఫీ, ఖైస్ అహ్మద్, నసీర్ ఖాన్ మరూఫ్ఖిల్, ఏఎం గజన్ఫర్, బిలాల్ సమీ, బషీర్ అహ్మద్, నవీద్ జద్రాన్.

