కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) బీఆర్ఎస్‌దే విజయం అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) జోస్యం చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కానీ హామీలతో తెలంగాణ ప్రజలను వంచించారన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్నీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ దారుణంగా మోసం చేసిందనీ ఆరోపించారు.
జాబ్ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు తమ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని కోరారు. గత ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా ఈ సారి మళ్లీ ఓటర్‌గా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు శరత్, ఈశ్వరయ్య, మధు మోహన్, నవకాంత్, సీనియర్ నాయకులు జహంగీర్,శ్రీనివాస్ రెడ్డి, క్రాంతి, ఇమ్రాన్, సుధాకర్, సాదిక్, బీఆర్ఎస్వి నాయకులు శివకుమార్, నవీన్ రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మంత్రి: జగదీష్ రెడ్డి
Follow Us On : WhatsApp

