కలం, వెబ్‌డెస్క్: ఓ రాజకీయ నాయకుడిని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూసిన ఓ పోలీస్ ఏకంగా ఉద్యోగమే కోల్పోయాడు. ఈ ఘటన పంజాబ్ (Punjab)లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఖన్నాలో శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో 30 గ్రాముల హెరాయిన్ గుర్తించారు. ఆ తర్వాత మహంత్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ బయటపడింది.
మహంత్ ఇంట్లో పోలీసుల సోదాలకు కొద్దిసేపటి ముందు ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ (ASI Sukhdev Singh) ఒంటరిగా ఇంట్లోకి వచ్చారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోని బెడ్ కింద డ్రగ్ష్ పెట్టారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సుఖ్‌దేవ్ సింగ్ పెట్టిన డ్రగ్స్ ఆధారంగానే పోలీసులు మహంత్‌ను అరెస్ట్ చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా సుఖ్‌దేవ్‌సింగ్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయనను విధుల్లో నుంచి తొలగించారు. ఆ తర్వాత మహంత్ కశ్మీర్‌ను ఈ కేసు నుంచి విడుదల చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఏఎస్ఐ సుఖ్‌దేవ్ మహంత్ ఇంట్లో డ్రగ్స్ పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై విపక్షాలు అధికార ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

