కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. ప్రభుత్వం, కళాశాలలు, విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
సోమవారం సచివాలయంలో టాస్క్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మధ్య మంత్రి సమక్షంలో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ తదితర ఇండస్ట్రీ ఓరియెంటెడ్ అంశాల్లో శిక్షణ ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అంతేగాకుండా ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్ చేసేందుకు AWS క్లౌడ్ కన్సోల్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఏడాది పాటు ఉచితంగా..
ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి AWS స్కిల్ బిల్డర్ ద్వారా 900 కంటే ఎక్కువ డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు. గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షల కోసం డిస్కౌంట్ వోచర్లను కూడా అందిస్తామన్నారు.
విద్యార్థులకు సాంకేతిక నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు, హ్యాకథాన్లను నిర్వహిస్తామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వివరించారు. ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : బిడ్డను భుజాన మోస్తూ 14 కి.మీ. నడక..!
Follow Us On : WhatsApp

