కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణం ఇది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సేకరించిన కోట్ల రూపాయల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం అక్రమంగా పక్కదారి పట్టింది. ఈ వ్యవహారం (Kothagudem Rice Mill Scam)లో బాధ్యులైన మేదరబస్తీలోని మురళీకృష్ణ రైస్ మిల్లు యజమాని, కో పార్టనర్ ఆళ్ల మురళీ గోపాలకృష్ణతోపాటు అంజనమ్మపై త్రీ టౌన్ పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు.
అన్నదాతల నుంచి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సేకరించిన దాదాపు 2,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రాసెసింగ్ నిమిత్తం మేదరబస్తీలోని మురళీకృష్ణ రైస్ మిల్లుకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ ధాన్యాన్ని మిల్లులో ఆడించి, తద్వారా వచ్చే బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. అయితే, సదరు యజమాని ఈ నిబంధనలకు తూట్లు పొడిచి ఆ ధాన్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టించారు. ఈ గోల్మాల్ అయిన ధాన్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.6.90 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా వేశారు.
గత నెల అక్టోబర్ 28న పౌరసరఫరాల సంస్థ మేనేజర్ త్రినాథ్ బాబు బృందం మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో మిల్లులో నిల్వ ఉండాల్సిన భారీ మొత్తంలో ధాన్యం పూర్తిగా గల్లంతైనట్లు గుర్తించారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని మిల్లులో ఆడించకుండా, అనధికారికంగా వేరొక వ్యక్తులకు అక్రమంగా తరలించినట్లు నిర్ధారించారు. సివిల్ సప్లై డీఎం ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని కొల్లగొట్టిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

