కలం, వెబ్డెస్క్: బిడ్డను తొమ్మిది నెలలు మోసి, కనేందుకు ఎన్నో కష్టాలు భరించే తల్లి తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కూడా ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ఇలాగే ఓ గిరిజన తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు పడిన కష్టం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అనారోగ్యానికి గురైన తన బిడ్డకు వైద్యం అందించడం కోసం ఆ తల్లి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని విజయనగరం (Vizianagaram) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గిరిజన గ్రామం పల్లపు దుంగడకు చెందిన జన్ని సుంకరమ్మకు 12 ఏళ్ల కుమార్తె సంపూర్ణ ఉంది. సంపూర్ణ ఇటీవల అనారోగ్యానికి గురైంది. అయితే గ్రామంలో ఆమెకు వైద్యం అందించడానికి వసతులు లేవు.
పల్లపు దుంగడ నుంచి ఆస్పత్రి ఉన్న చోటుకు వెళ్లేందుకు రోడ్లు కూడా సరిగా లేవు. పైగా ఇటీవల తుఫాన్ ధాటికి ఉన్న రోడ్లు కూడా దారుణంగా తయారయ్యాయి. అనారోగ్యంతో ఉన్న కూతురి పరిస్థితి చూడలేని సుంకరమ్మ ఆమెను తన భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి బయలు దేరింది. సుమారు 7 కిలో మీటర్లు నడిచి ఆస్పత్రికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలోనూ మరో ఏడు కిలోమీటర్లు కుమార్తెను మోసుకుంటూ ఇంటికి చేరుకుంది. ఈ అత్యవసర సమయంలో బిడ్డ వైద్యం కోసం ఈ తల్లి పడిన వేదన అందరినీ కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పల్లపు దుంగడకు మంజూరైన 6.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. దీనివల్ల స్థానికులు అత్యవసర వైద్యం సహా ప్రాథమిక సేవలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనికి సంబంధించిన టెండర్లు సైతం ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.

