కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఐదో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 (క్లస్టర్–డి) (Telangana Police Sports Meet) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు హనుమకొండలోని మూడు వేదికల్లో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 1,535 మంది పోలీస్ క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.
హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారంలోని ఎస్‌వీఎస్ కళాశాలల్లో పోటీలను నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బంది తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నారు.

