కలం, కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో (Nursing College) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్పై వెంటనే విచారణ జరిపించాలని, అవకతవకలకు పాల్పడుతున్న ‘వారధి సొసైటీ’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్ మాట్లాడుతూ… తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. UGC-2013 గైడ్లైన్స్, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల (ద్రవిడ, ఆచార్య నాగార్జున, శ్రీ వేంకటేశ్వర తదితర) పరిధి దాటి చదివిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోకూడదని, గతంలో TPSC, గురుకులాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నోటిఫికేషన్లలోనూ ఇలాంటి సర్టిఫికెట్లను అనర్హులుగా ప్రకటించారని గుర్తుచేశారు.
తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో B.Lib.I.Sc/M.Lib.I.Sc పూర్తి చేసిన అభ్యర్థులకే అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. లైబ్రేరియన్ అర్హతల్లో రెగ్యులర్గా చదువుకున్న వారికి, మెడికల్ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న నిరుద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అక్రమ పద్ధతిలో వేరే రాష్ట్రాల సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేందుకు యత్నిస్తున్న వారిపై తక్షణమే విచారణ జరిపి, అర్హులైన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా నాయకులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

