కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రం మరో భారీ రాజకీయ కార్యక్రమానికి వేదిక కానుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా బీజేపీ(BJP) మంగళవారం నిర్వహించనున్న మహా పాదయాత్ర (Maha Padayatra) కు సర్వం సిద్ధమైంది. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలం నేతలు భారీ జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సల్ (Sunil Bansal) ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ పాదయాత్రపై ఆసక్తి నెలకొంది.
50 వేల మందితో శక్తి ప్రదర్శన..
నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలను సమీకరించాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను సమాయత్తం చేశారు. సర్పంచులు, పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
ఎస్ఐఆర్పై రాజకీయ సమరం..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. దీనికి దీటుగా ఎస్ఐఆర్పై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడం, కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా బీజేపీ ఈ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. రాజకీయ ఆరోపణలకు ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెప్పాలనే వ్యూహంతో కమలం పార్టీ ముందుకు సాగుతోంది.
హెలికాప్టర్లో సునీల్ బన్సల్ రాక..
మహా పాదయాత్ర(Maha Padayatra)లో పాల్గొనేందుకు సునీల్ బన్సల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిర్మల్‌కు రానున్నారు. ఇందుకోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా, భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి వాహనంలో శాంతినగర్ చౌరస్తాకు చేరుకొని అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా వివేక్ చౌక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మహా పాదయాత్ర కొనసాగనుంది. సునీల్ బన్సల్ తొలిసారిగా నిర్మల్‌కు వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశాయి. నగరమంతా కాషాయ జెండాలు, తోరణాలతో సందడిగా మారింది. జాతీయ నాయకుడి పర్యటన నిర్మల్ బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపనున్నట్టు తెలుస్తోంది.
Also Read : ఇంధన విప్లవం.. E-20 ఇథనాల్‌కు మొక్కజొన్న..!
Follow Us On: X(Twitter)

