బార్లను మరిపిస్తున్న వైన్స్ పర్మిట్ రూములు: TJP

కలం, కరీంనగర్: బార్లను మరిపిస్తున్న వైన్స్ పర్మిట్ రూములపై ఎక్సైజ్ శాఖ సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ (TJP Chief Shivaraj) డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో ప్రజా ఆరోగ్య సమస్యలపై శివరాజ్ మాట్లాడారు. కరీంనగర్ పట్టణంలో వైన్స్ షాపులకు అనుబంధంగా కొనసాగుతున్న పర్మిట్ రూములు బార్లను మరిపించేలా మారుతున్నాయని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వైన్స్ షాపులకు అనుమతులు ఇచ్చే సమయంలో విధించే నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించాల్సిన బాధ్యత ఉందని శివరాజ్ అన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పర్మిట్ రూముల నిర్వహణపై తగిన పర్యవేక్షణ లేదని విమర్శించారు. పర్మిట్ రూముల పేరుతో బార్ల తరహాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనుమతించిన సమయాలకు మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? నిర్ణీత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా? అనే అంశాలపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైన్స్ పర్మిట్ రూములపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని శివరాజ్ అన్నారు. అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పర్మిట్ రూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్ణీత సమయాలకు మించి మద్యం విక్రయాలు జరగకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని, పర్మిట్ రూముల నిర్వహణలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్వహిస్తున్న మద్యం కేంద్రాలపై ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే స్పందించాలని శివరాజ్ అన్నారు. ప్రభుత్వ ఆదాయమే లక్ష్యంగా కాకుండా ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం, యువత భవిష్యత్తును కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, వైన్స్ పర్మిట్ రూముల వ్యవహారంలో అధికారులు ఇప్పటికైనా మేల్కొని నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముగురం మిరియా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెద్దెల్ల చంద్రకాంత్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్యం అశోక్ రెడ్డి, కొమురయ్య ముదిరాజ్. వినోద్ కుమార్, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>