సీఎన్‌జీ కొరత.. ఆటో డ్రైవర్ల వ్యథ..!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలో తీవ్ర సీఎన్‌జీ గ్యాస్ కొరత (Nalgonda CNG Crisis) ఆటో డ్రైవర్లు, కార్ల ఓనర్లను వేధిస్తోంది. సీఎన్ జీ గ్యాస్ కోసం రోజంతా క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తుండడంతో ఆటోలు సరిగా నడపలేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న కట్టంగూరు, తిప్పర్తి, కనగల్, నార్కట్‌పల్లి వంటి ప్రధాన మండలాల్లోని గ్రామాల నుంచి దాదాపు 600కి పైగా సీఎన్‌జీ ఆటోలు, వందలాది ప్రైవేటు కార్లు నిత్యం రోడ్లపై తిరుగుతుంటాయి. ఆయా వాహనాల అవసరాలు తీర్చడానికి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క సీఎన్‌జీ బంకు ఉంది.

అందులో రోజూ ఉదయం మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంటుంది. క్యూలైన్లలో ఏమాత్రం ఆలస్యమైనా ఆ రోజు గ్యాస్ దొరికే పరిస్థితి ఉండదు. ఫలితంగా ఆటోను పక్కన పెట్టాల్సిందే. దీంతో ప్రతిరోజూ ఉదయం నుంచే బంక్ వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు, కార్లు క్యూ కడుతుంటాయి. జిల్లా కేంద్రానికి ఇతర మండలాల నుంచి గ్యాస్ కోసం రావాల్సి రావడం, బంక్ వద్ద ప్రెజర్ సరిగా లేకపోవడం, తరచూ స్టాక్ అయిపోతుండటంతో గ్యాస్ నింపుకోవడం కష్టతరంగా మారింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎన్‌జీ వాహనాలు వాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో చాలామంది రుణాలపై సీఎన్ జీ ఆటోలు కొనుగోలు చేశారు. కానీ, ఇప్పుడు ఆ వాహనాలే వారి బతుకు కష్టాలుగా మారాయి. సీఎన్‌జీ బంకులను తగినన్ని ఏర్పాటు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి.

గంటల కొద్దీ క్యూలైన్లోనే..

ఆటో డ్రైవర్ రోజంతా నడపాలంటే సగటున 3 కేజీల సీఎన్‌జీ గ్యాస్ అవసరం. ప్రస్తుత ధరల్లో 3 కిలోల గ్యాస్‌కు దాదాపు రూ. 300పైగా అవుతోంది. డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ దొరకడం లేదు. ప్రతిరోజూ కనీసం గంట నుంచి రెండు గంటల పాటు క్యూ లైన్‌లో నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం సమయానికి గ్యాస్ దొరికితే ఆ రోజుకు బండి ముందు కు సాగుతుంది. ఒకవేళ గ్యాస్ స్టాక్ అయిపోతే ఆటోను పక్కన పెట్టేసి ఇంటికి పోతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈఎంఐల కోసం వడ్డీలకు తెచ్చి..

ఆటో డ్రైవర్ రోజు సగటున రూ. 1000 వరకు కిరాయి నడుపుతారు. ఇందులో రూ. 300పైగా గ్యాస్‌కే పోతాయి. మిగిలే రూ. 700లోనే అన్ని ఖర్చులూ నెట్టుకురావాలి. ఆటో కొనుగోలుకు బ్యాంకుల నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు తీసుకోగా.. నెలకు రూ. 6,000 నుంచి రూ. 8,000 వరకు ఈఎంఐ చెల్లించాలి. గ్యాస్ సరిగా దొరక్క రోజువారీ సంపాదన పడిపోవడంతో ఈఎంఐలు కట్టడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడే బండి కొనుక్కుంటే.. అది తమను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని సీఎన్జీ ఆటోల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తక్షణ చర్యలే

సీఎన్‌జీ గ్యాస్ కొరత (Nalgonda CNG Crisis) తో ఇబ్బందులు పడుతుండగా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, గ్యాస్ సరఫరా సంస్థలు తక్షణమే స్పందించాలి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బంకుపై ఒత్తిడి తగ్గించేందుకు కట్టంగూరు, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కనగల్ వంటి ప్రాంతాల్లో కొత్త సీఎన్‌జీ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంది. నల్లగొండలోని ప్రస్తుత బంక్‌లో వాహనాలకు వేగంగా గ్యాస్ నింపేందుకు వీలుగా హై-ప్రెజర్ పంపులను అందుబాటులోకి తేవడమే కాకుండా, నిరంతరాయంగా గ్యాస్ స్టాక్ ఉండేలా చూడాలి.

రోజువారీ ఉపాధిపైనే ఆధారపడి జీవించే ఆటో డ్రైవర్ల సమయం వృథా కాకుండా ఉండటానికి ప్రైవేటు కార్లు, ఇతర వాహనాలతో సంబంధం లేకుండా ఆటోల కోసం ప్రత్యేక క్యూలైన్‌ను కేటాయించాలని ఆటోడ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఇంధన సరఫరా సంస్థలు స్పందించి నల్లగొండ జిల్లాలో సీఎన్‌జీ బంకుల సంఖ్యను పెంచాలని, డ్రైవర్లకు నిరంతర గ్యాస్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆటో కార్మికుల యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>