కలం, నిజామాబాద్ బ్యూరో: దేశ సరిహద్దుల్లో 25 ఏళ్లపాటు సైనికుడిగా సేవలందించిన ఆయన.. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక నాగలి పట్టాడు. ఆధునిక సాంకేతికతను, ప్రకృతి వ్యవసాయాన్ని జోడించి ఒక అద్భుతమైన నమూనా క్షేత్రాన్ని సృష్టించాడు. ఆయనే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సిరివేణి నవీన్ కుమార్. ఆయన ఏర్పాటు చేసిన ‘జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్’(Jai Jawan Agro Farming) క్షేత్రం నేడు జిల్లాలోనే అత్యంత విజయవంతమైన సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనాగా నిలిచింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ క్షేత్రాన్ని సందర్శించి, తాను చూసిన క్షేత్రాల్లో ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ప్రశంసించడం విశేషం.
సైనికుడి నుంచి సేంద్రియ రైతుగా..
నవీన్ కుమార్‌కు వ్యవసాయం కొత్తేమీ కాదు. ఆయన తల్లిదండ్రులు పుష్ప, మల్లేశ్ ఇద్దరూ రైతులే. వీరికి సుమారు 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రుల నుంచి వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్న నవీన్.. మరోవైపు దేశసేవను లక్ష్యంగా చేసుకుని సైన్యంలో చేరారు. 25 ఏళ్లపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ సుబేదార్ మేజర్ స్థాయికి ఎదిగారు. 2024 అక్టోబర్ 31న బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కేంద్రంలో పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాల వైపు మొగ్గుచూపుతుంటే.. నవీన్ మాత్రం తన కుటుంబానికి తరతరాలుగా ఉన్న వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులకు చెందిన 28 ఎకరాల్లో 9 ఎకరాలను సేంద్రియ వ్యవసాయానికి కేటాయించారు. దీనికి ‘జై జవాన్ ఆగ్రో ఫామ్’ అని పేరు పెట్టారు.
ఒకే పంటపై ఆధారపడకుండా..
సాధారణంగా రైతులు ఒకటి, రెండు పంటలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. పంట చేతికందకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నవీన్ కుమార్ తన క్షేత్రంలో పంటల సాగుతోపాటు అనుబంధ రంగాలకూ ప్రాధాన్యమిచ్చారు. వరి, కూరగాయలు, పూల సాగుతోపాటు నిమ్మ తోటలను పెంచుతున్నారు. వీటికి తోడుగా పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, చేపల సాగును చేపట్టారు. ఒక రంగం నుంచి వచ్చే వనరులను మరో రంగానికి ఉపయోగపడేలా సమన్వయం చేస్తున్నారు. పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేస్తూ సేంద్రియ సాగుకు అవసరమైన ఎరువులను సమకూర్చుకుంటున్నారు.
నేర్చుకుంటూ.. ప్రయోగిస్తూ
- వ్యవసాయంలో మరింత పరిజ్ఞానం సంపాదించాలన్న ఉద్దేశంతో నవీన్ కుమార్ వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌లో పుట్టగొడుగుల పెంపకం, ఉద్యానవనం, తేనెటీగల పెంపకంపై శిక్షణ పొందారు.
- నిజామాబాద్‌లో ప్రకృతి వ్యవసాయంపై కోర్సు చేశారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తన క్షేత్రంలో అమలు చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నారు.
- పాడి పరిశ్రమలో ప్రస్తుతం ఆవులు, గేదెల నుంచి రోజుకు సుమారు 35 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఉత్పత్తిని రోజుకు 100 లీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
- పంటల సాగుతోపాటు పాడి, కోళ్ల పెంపకం, చేపల సాగు వంటి విభాగాలను అభివృద్ధి చేస్తూ క్షేత్రాన్ని బహుముఖ ఆదాయ వనరుగా తీర్చిదిద్దుతున్నారు.
నీటి వినియోగంలో స్పెషల్ కేర్
నీటి కొరతను అధిగమించేందుకు నవీన్ కుమార్ తన క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంటలకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. చేపల పెంపకం కోసం ప్రత్యేకంగా పాండ్స్ నిర్మించారు. వీటి ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా పంటలు, చేపల పెంపకానికి ఇబ్బంది కలగకుండా జనరేటర్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. భవిష్యత్తులో విద్యుత్ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఇలా నీరు, విద్యుత్ వినియోగంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ.. సాగును మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు.
పంటతోపాటు ఉత్పత్తుల అమ్మకం..
తన క్షేత్రంలో తయారయ్యే ఉత్పత్తులను కూడా నేరుగా వినియోగదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. తేనె, నెయ్యి, పేడతో తయారుచేసిన పిడకలు, వర్మీ కంపోస్టు, సేంద్రియ సబ్బులు, కూరగాయలను విక్రయిస్తున్నారు. ఆగస్టు 15న నిజామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్ ద్వారా తన వ్యవసాయ క్షేత్రంలోని ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేశారు. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు రైతే భాగస్వామిగా ఉంటే మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని నవీన్ భావిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతోపాటు రైతుకు తగిన ధర లభించేలా ఇటువంటి ప్రయత్నాలు దోహదపడతాయని చెబుతున్నారు. వ్యవసాయంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా జూన్ 26న ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.
రెండు ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రం
వాతావరణ మార్పులు, నీటి కొరత నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నవీన్ అభిప్రాయపడుతున్నారు. ఆయన క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.. రెండు ఎకరాలను పంటల ప్రదర్శనా క్షేత్రంగా ఎంపిక చేశారు. తక్కువ నీటితో సాగు చేయగల శనగ, పెసలు, కుసుమ వంటి వాణిజ్య పంటలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ పంటల సాగు విధానాలు, వాటి ప్రయోజనాలను ఇతర రైతులకు పరిచయం చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించే సాగు పద్ధతులపై అవగాహన కల్పించవచ్చన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
వ్యవసాయమే ఎవర్గ్రీన్ వృత్తి : నవీన్ కుమార్
సాఫ్ట్వేర్ వంటి రంగాల్లోనూ ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. కానీ వ్యవసాయంలో మాత్రం మంచి భవిష్యత్తు ఉంది. ఇది ఎప్పటికీ ఎవర్గ్రీన్ వృత్తి. యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తే వారిలో ఓపిక పెరుగుతుంది. ఎన్నో విషయాలు నేర్చుకోవడంతో పాటు ప్రకృతికి దగ్గరవుతారు. ఆధునిక, హైటెక్ పద్ధతులు పాటిస్తే వ్యవసాయం కంటే మంచి రంగం మరొకటి ఉండదని మాజీ సుబేదార్ మేజర్, జై జవాన్ ఆగ్రో ఫార్మ్ వ్యవస్థాపకుడు నవీన్ కుమార్ అభిప్రాయపడ్డారు. సమాజంలో వ్యవసాయంపై చులకన భావన పెరిగిపోయిందని ఆయన అన్నారు. చదువుకోని వారు, పనికిరాని వారు మాత్రమే వ్యవసాయం చేస్తారనే అభిప్రాయాలు సరికావన్నారు. రైతు కుటుంబం నుంచి సంబంధం వస్తే పిల్లను ఇవ్వడానికి కూడా వెనుకాడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎం.ఎస్. స్వామినాథన్, వర్గీస్ కురియన్ వంటి ప్రముఖులు వ్యవసాయాన్ని, దాని అనుబంధ రంగాలను నమ్ముకుని ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. బీటెక్ చదివితేనే గౌరవం వచ్చినట్లు కాదని, రైతు అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని నవీన్ కుమార్ ఆకాంక్షించారు.

