ప్రైవేట్​ హాస్టళ్లకు ఎల్​ నినో దెబ్బ.. హైదరాబాద్ లో వాటర్ ఫియర్!

కలం, తెలంగాణ బ్యూరో: ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కూ ఎల్‌ నినో కష్టాలు మొదలయ్యాయి. బ్యాచ్‌లర్లుగా హాస్టళ్లలో ఉంటున్న వాళ్లకు నీళ్ల ఇబ్బందులు (Water Crisis) వచ్చిపడ్డాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని కొన్ని పీజీ (పేయింగ్ గెస్ట్) హాస్టళ్లు, మ్యాన్షన్స్‌లలో ట్యాప్ వాటర్ సప్లైకి స్పెషల్ టైమింగ్స్ అమలవుతున్నాయి. సొంత బోర్‌వెల్స్ ఎండిపోవడం, ప్రభుత్వ వాటర్ కనెక్షన్లు లేకపోవడంతో ప్రైవేట్ హాస్టళ్లకు ట్యాంకర్లే దిక్కయాయి. జలమండలి నుంచి బుక్ చేసుకుందామంటే వారం పది రోజుల వెయిటింగ్ లిస్టు చూపిస్తుండడంతో ప్రైవేట్ ట్యాంకర్ల మీదనే ఆధారపడుతున్నాయి.

దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకురావాల్సి వస్తుండడంతో వాటి ధరలూ గణనీయంగా పెరిగాయి. దీంతో పీజీల్లో ఉంటున్న వాళ్లకు అవసరాల మేరకు నీళ్లను సప్లై చేయలేక, వాళ్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం సాధ్యంకాక నిర్వహణ ఆర్థికంగా ఇబ్బందికరంగా మారిందని యజమానులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో నీటి వినియోగం కోసం సబ్ మీటర్లు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.

నిర్వాహకులపై భారం..

ఐటీ కారిడార్‌లో నెలకొన్న వాటర్ క్రైసిస్‌ (Water Crisis) తో అటు బ్యాచ్‌లర్లకు, ఇటు హాస్టళ్ల యజమానులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాస్టల్‌లోని బ్యాచ్‌లర్ల సంఖ్యకు అనుగుణంగా రోజుకు మూడు, నాలుగు ట్యాంకర్లు (ఒక్కొక్కటి 5 వేల లీటర్ల కెపాసిటీ) అవసరమవుతున్నాయి. ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్‌కు ఇంతకాలం రూ.800 చొప్పున వసూలు చేయగా.. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా డీజిల్ రేట్లు పెరిగాయని రూ.1,200-1,500కు పెంచారు.

ఇప్పుడు సిటీ శివారు ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తున్నదని, దూరాభారం పెరిగిందని రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్టళ్లకు ప్రతీరోజు వాటర్ ఛార్జీల పేమెంట్స్ భారంగా మారాయి. ఉద్యోగుల నుంచి వాటర్ ఛార్జ్ వసూలు చేస్తే ఖాళీ చేసి వెళ్లిపోతారేమోననే భయం, సొంతంగా భరించాలంటే శక్తికి మించిన భారంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

రానున్న రోజుల్లో మరింత భారం

సహజంగా సమ్మర్ టైమ్‌లో మాత్రమే సొంత బోర్లలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయని, ఈసారి మాత్రం ఆగస్టు నుంచే ఎండిపోయాయని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాతా కరుణాకర్ తెలిపారు. ‘‘జలమండలి నుంచి కొన్ని రోజులు ట్యాంకర్లు తెప్పించుకున్నాం. కానీ ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వెయిటింగ్ పీరియడ్ ఉంటున్నది. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి నెలకొంటే రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశమున్నది.

సమ్మర్ నాటికి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ట్యాంకర్ ఏజెన్సీలు రేటు దాదాపు డబుల్ చేయాల్సి ఉంటుందంటూ హాస్టళ్లకు చెప్పాయి. కేవలం సాధారణ అవసరాలకు వాడుకునే నీటి కోసమే ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా అదనపు భారం పడుతున్నది. హాస్టళ్లలో ఉండే చాలా మంది యావరేజ్‌గా రూ.30 వేలు, రూ.40 వేల మధ్యలో జీతాలు తీసుకునేవారే. వాళ్ల నుంచి వాటర్ ఛార్జీ పేరుతో డబ్బులు వసూలు చేయడం ప్రాక్టికల్‌గా ఇబ్బందే” అని వాపోయారు.

సబ్ మీటర్ల ఆలోచన

గతంలో విద్యుత్ వినియోగం పెరిగిందన్న సమస్యతో ప్రతీ రూమ్‌కు సబ్ మీటర్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, దీంతో విచ్చలవిడి వినియోగం తగ్గి పొదుపుగా వాడుకోడానికి దోహదపడిందని కరుణాకర్ తెలిపారు. ఇప్పుడు నీటి కొరతతో ట్యాప్‌లన్నింటికీ వాటర్ రీడింగ్ సబ్ మీటర్లను పెట్టాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని వాటర్ క్రైసిస్‌ను అధిగమించడానికి ఏం చేయాలని త్వరలో చర్చిస్తామని, అందులో మీటర్లపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రస్తుతానికి వాటర్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకపోయినా.. నీటి వినియోగాన్ని నియంత్రించడానికి, పొదుపుగా వాడుకోడానికి కొన్ని హాస్టళ్లలో టైమింగ్స్ పెట్టాల్సి వచ్చిందన్నారు. ఐటీ కారిడార్‌లో చాలా భవనాలు కొత్తగా నిర్మాణం కావడంతో హాస్టళ్ల నిర్వహణలో పోటీ పెరిగిందని, వాటర్ ఛార్జీ పేరుతో అదనంగా వసూలు చేస్తే అది బిజినెస్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాషింగ్ మెషీన్ల ఆపరేషన్‌లోనూ వీలైనంత వరకు నీటి వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>