ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలి.. వ్యాపారులకు మున్సిపల్ సూచన

కలం, మునుగోడు : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చండూరు మున్సిపాలిటీ (Chandur Municipal) పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం కోరారు. శనివారం చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కిరాణా షాపుల అసోసియేషన్ సభ్యులతో చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు అధ్యక్షతన, కమిషనర్ ఎల్. మల్లేశం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్లాస్టిక్ కవర్ల (Plastic Covers) వినియోగం పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.

వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై, మురుగు కాలువల్లో పడేయడం వల్ల డ్రైనేజీలు పూడుకుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం నిషేధించబడిందని, నిషేధిత ప్లాస్టిక్ కవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని వ్యాపారులకు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగులను వినియోగించాలని సూచించారు.

అలాగే కిరాణా వ్యాపారులు తమ దుకాణాల నిర్వహణలో తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఇతర వినియోగ వస్తువులను విక్రయించరాదని, ప్రతి వస్తువుపై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. ప్రతి దుకాణం ముందు డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకొని దుకాణాల వద్ద వెలువడే చెత్తను రోడ్లపై, మురుగు కాలువల్లో వేయకుండా అందులోనే వేయాలని కోరారు. దుకాణాలకు సంబంధించిన సరుకులు, ఇతర సామగ్రిని ఫుట్‌పాత్‌లపై ఉంచి పాదచారులకు ఇబ్బందులు కలిగించరాదని, రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.

మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని, లైసెన్స్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కిరాణా వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని, చండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా సహకారం అందిస్తామని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ రహిత చండూరు సాధ్యం పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని చైర్మన్, కమిషనర్ పేర్కొన్నారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని ప్రోత్సహించకుండా ప్రత్యామ్నాయ సంచులను అందుబాటులో ఉంచాలని, వినియోగదారులు కూడా ఇంటి నుంచి వస్త్ర సంచులను తీసుకురావడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన చండూరు పట్టణాన్ని నిర్మించగలమని తెలిపారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా చండూరును తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపాలిటీకి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>